: సినిమా విడుదలకు డబ్బుల్లేక దర్శకుడు ఆత్మహత్యాయత్నం!
సొంతంగా నిర్మించిన చిత్రం ఎంతకీ విడుదల కాకపోవడంతో ఓ దర్శకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో జరిగింది. నందినీ లేఔట్ కు చెందిన శశికుమార్ రెండు సంవత్సరాల కిందట కొత్త కథానాయకుడు సందీప్ తో 'ఆఫ్ మెంటల్' అనే సినిమాను ప్రారంభించాడు. ఆయనే దర్శకత్వం వహించారు. షూటింగ్ మొత్తం పూర్తయి సంవత్సరం గడుస్తోంది. ఇక సినిమానే విడుదలకావాల్సి ఉంది. డబ్బుల్లేక పోవడంతో విడుదల ఆగిపోయింది. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన దర్శకుడు కారులో స్థానిక కామాక్షి పాళ్య బస్టాండు సమీప ప్రాంతానికి వెళ్లి వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ లో పురుగుల మందు కలుపుకుని తాగాడు. అప్పుడే భార్య ఫోన్ చేయగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. దాంతో భార్య స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడారు. సినిమా విడుదలకాకపోవడం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించానని అసలు విషయం చెప్పాడు.