: ఏపీ సీఎం కాన్వాయ్ ఢీ కొట్టిన వ్యక్తి మృతి
ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ లోని ఒక వాహనం ఢీ కొట్టడంతో గాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం విజయవాడలో తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన నిమిత్తం సీఎం చంద్రబాబు కాన్వాయ్ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. యనమలకుదురు గ్రామంలో నివసించే బందా నాగేంద్ర వరప్రసాద్ (54) బకింగ్ హామ్ పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం సైకిల్ పై ఆఫీసుకు వెళుతున్న ఆయన మహాత్మాగాంధీ రోడ్డు నుంచి రాజగోపాలాచారి రోడ్డులోకి మలుపు తిరుగుతుండగా కాన్వాయ్ లోని ఒక వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా అపస్మారక స్థితిలోనే ఉన్న ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. నాగేంద్రవరప్రసాద్ కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.