: రూ. 251కి స్మార్ట్ ఫోన్ సాధ్యమే... ఇదిగో లెక్క!


కనీసం రూ. 2,500 పైగా వెచ్చిస్తేగాని రాని స్మార్ట్ ఫోన్ రూ. 251కి ఎలా సాధ్యం? నెటిజన్ల మనసులను తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానాన్ని టెక్నాలజీ రంగ నిపుణులు చెప్పారు. కొంత ప్రభుత్వ సహకారం, అధిక లాభాలపై దృష్టి లేకుంటే ఇది సాధ్యమేనని చెబుతున్నారు. ఆ లెక్క ఎలాగంటే... ఫ్రీడమ్ 251లో ఉన్న స్పెసిఫికేషన్స్ తో కూడిన ఫోన్ కావాలంటే కనీసం రూ. 2,400 నుంచి రూ. 2,600 వరకూ ఖర్చు పెట్టాలి. సరాసరిన రూ. 2,500గా ఫోన్ ఖరీదును లెక్కిస్తే... * ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ల అమ్మకాలపై ఉన్న సుంకాలను తొలగిస్తే, దాని ధర 30 శాతం వరకూ తగ్గుతుంది. ఇండియాలో మొబైల్ ఫోన్లపై వివిధ రాష్ట్రాల్లో 20 నుంచి 30 శాతం వరకూ సుంకాలు విధిస్తున్నాయి. * ఇక డిస్ట్రిబ్యూషన్, రిటైల్ సేల్స్ పేరెత్తకుండా స్వీయ మార్గాల్లో అమ్మకాలు సాగిస్తే మరో 35 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. (గతంలో డేటావిండ్ సంస్థ ఆకాష్ టాబ్లెట్లను ఇదే మార్గంలో తక్కువ ధరకు విక్రయించింది) * ఇక త్వరలో మేకిన్ ఇండియాలో భాగంగా స్టార్టప్ కంపెనీలకు దక్కనున్న 13.8 శాతం జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) మినహాయింపును కలుపుకుంటే, ఫోన్ ధర దాదాపు 75 శాతం వరకూ తగ్గుతుంది. అంటే రూ. 2,500 ఫోన్ ధర రూ. 1,875 తగ్గి రూ. 625 అవుతుంది. * ఇక కోట్ల సంఖ్యలో ఫోన్ కు ఆర్డర్లు వచ్చి అంతే మొత్తంలో విడిభాగాలకు ఆర్డర్ ఇచ్చిన వేళ, ధర మరో 10 నుంచి 15 శాతం వరకూ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆపై అమ్మకాల కోసం వెబ్ సైట్ కు లక్షల్లో క్లిక్స్ వస్తుంటాయి కాబట్టి వ్యాపార ప్రకటనల ఆదాయం, సైట్ క్లిక్స్ ఆదాయం ఎలాగూ ఎక్కువగానే ఉంటుంది. * పైగా, ఫోన్ ఆర్డర్లు భారీగా ఉంటే, ఆ ఆదాయంపై కొంత వడ్డీ కూడా వస్తుంటుంది. (ఫోన్ బుకింగ్స్ 21తో ముగుస్తాయి, ఆపై డెలివరీకి నాలుగు నెలల సమయం పడుతుంది). ఓ కోటి ఫోన్లకు ఆర్డర్ వచ్చిందనుకుంటే, రూ. 251 కోట్లపై కనీసం మూడు నాలుగు నెలల వడ్డీ సంస్థకు అదనపు ఆదాయం అవుతుంది. * ఇక చివరిగా పలు ప్రభుత్వ యాప్స్ ఈ ఫోన్ లో ప్రీలోడెడ్ గా ఉన్నందున ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీలు పొందే అవకాశాలూ పుష్కలం. కాబట్టి రూ. 251లో అన్ని ఫీచర్లున్న లోఎండ్ ఫోన్ ను అందించడం సాధ్యమేనన్నది నిపుణుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News