: ఏపీఎస్ఆర్టీసీలో ఉత్కంఠ పోరు... పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తేనే ఫలితం ఖరారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు... ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను తలపించాయి. సంస్థలోని ప్రధాన కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ)లతో పాటు ఈ దఫా కొత్తగా అధికార పార్టీ టీడీపీ అనుబంధ కార్మిక సంఘం కార్మిక పరిషత్ కూడా బరిలోకి దిగింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమై, రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. ఈ లెక్కింపులో ఈయూ, ఎన్ఎంయూల మధ్య విజయం దోబూచులాడింది. ఆర్టీసీలో మొత్తం 54,361 ఓట్లు ఉండగా... ఎన్ఎంయూకు 24,302 ఓట్లు ఈయూకు 24,129 ఓట్లు వచ్చాయి. దీంతో ఈయూ కంటే కేవలం 173 ఓట్ల ఆధిక్యం సాధించిన ఎన్ఎంయూ కాస్తంత పైచేయి సాధించినా, స్పష్టమైన విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఇక పోస్టల్ బ్యాలెట్ లో పోలైన ఓట్లను లెక్కిస్తేనే కానీ అసలు విజయం ఎవరిదో తేలేలా లేదు. పోస్టల్ బ్యాలెట్ లో 1023 ఓట్లు ఉండగా, వాటిలో 800 ఓట్లు పోలైనట్లు సమాచారం. పోలైన ఓట్లలోనూ మెజారిటీ ఓట్లు ఎన్ఎంయూకే పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 23, 24 తేదీల్లో జరగనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయితేనే, విజయం ఎవరిదో ఖరారు కానుంది. దీంతో స్వల్ప ఆధిక్యం సాధించిన ఎన్ఎంయూ ఈ నెల 24 దాకా గెలుపు సంబరాల కోసం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News