: గూగుల్ బెలూన్ కూలిందా? దిగిందా?
శ్రీలంకలో ఇంటర్నెట్ సేవల నిమిత్తం గూగుల్ సంస్థ ప్రారంభించిన 'ప్రాజెక్టు లూన్' లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బెలూన్ తేయాకు తోటల్లో కూలిపోయిందని కొలంబో పోలీసులు తెలిపారు. ఇది కూలిపోవడాన్ని చూసిన స్థానికులు అదేంటో చూసేందుకు వెళ్లగా, అందులో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఇది కూలిపోలేదని శ్రీలంక సమాచార, సాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ బెలూన్ నిర్దేశించిన ప్రాంతంలో, నిర్దేశిత సమయానికి కిందికి దిగిందని పేర్కొంది. మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు గూగుల్ సంస్థ 'ప్రాజెక్టు లూన్' ను చేపట్టింది. ఇందులో భాగంగా భూమికి 18 వేల మీటర్ల ఎత్తులో భారీ బెలూన్ల సమూహంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరించే ఏర్పాటు చేస్తోంది. ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని గూగుల్ గతంలో చెప్పింది.