: ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని విద్యార్థులపై రుద్దాలనుకుంటోంది: రాహుల్


ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని, సిద్ధాంతాలని దేశంలోని విద్యార్థులపై రుద్దాలనుకుంటోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కలసి విద్యార్థుల గొంతు నొక్కుతున్నాయని విమర్శించారు. విద్యార్థుల వల్లే దేశం వర్ధిల్లుతుందని, ఒకవేళ ఆర్ఎస్ఎస్ జీవంలేని తన భావజాలాన్ని గనుక రుద్దితే అతిపెద్ద నేరం చేసినట్టవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై గొంతెత్తినందుకే ఆ మధ్య పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల గొంతు నొక్కారని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. జేఎన్ యూ వివాదాంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన అనంతరం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పాటియాల హౌస్ కోర్టు కాంప్లెక్స్ వద్ద మీడియా ప్రతినిధులు, విద్యార్థులపై దాడి జరుగుతున్నా ఢిల్లీ పోలీసులు ఆ హింసను ఏమాత్రం ఆపకుండా, ప్రేక్షక పాత్ర వహించడాన్ని మనమంతా చూశామని చెప్పారు. ఇటువంటి ఘటనలు దేశ ప్రతిష్ఠకు అంతర్జాతీయ స్థాయిలో కళంకం తీసుకొస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన రక్తంలోనే దేశభక్తి ఉందన్న రాహుల్, తన దేశభక్తి గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరంలేదని చెప్పారు. ఈ దేశం కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని, తమ కుటుంబాన్ని కూడా త్యాగం చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News