: ఎఫ్-16 యుద్ధ విమానాలకు 'మేకిన్ ఇండియా' ట్యాగ్ లైన్
ఎఫ్-16 యుద్ధ విమానాలు. యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న లాక్ హీద్ మార్టిన్ తయారు చేస్తున్న అత్యాధునిక విమానాలివి. ఇప్పుడా సంస్థ ఇండియాకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియాలో భాగంలో లక్ హీద్ మార్టిన్ ఓ భారీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంటును భారత్ లో నెలకొల్పాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలను భారత అధికారులతో జరుపుతున్నామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షా వెల్లడించారు. సింగపూర్ లో జరుగుతున్న ఎయిర్ షో 2016కు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ "ఎఫ్-16 యుద్ధ విమానాలను ఇండియాలో తయారు చేయాలన్న నిశ్చయంతో ఉన్నాం. త్వరలోనే విధివిధానాలు ఖరారవుతాయి. అంతకన్నా ముందు ఏ ప్రాంతంలో ప్లాంటు ఉండాలన్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సి వుంది" అన్నారు. ఎప్పటిలోగా ప్లాంటు నిర్మాణం పూర్తవుతుంది? అనుమతులు ఎప్పటిలోగా రావచ్చు? అన్న విషయాలకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. కాగా, 2011లో ఆరు సీ130జే సూపర్ హెర్క్యులస్ హెలికాప్టర్లను ఇండియాకు అందించిన లక్ హీడ్ మార్టిన్, వచ్చే ఏడు మరో ఆరు హెలికాప్టర్లను డెలివరీ ఇవ్వనుంది.