: రాహుల్ నేతృత్వంలో రాష్ట్రపతిని కలసిన కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న జేఎన్ యూ అంశం రాష్ట్రపతి వద్దకు చేరింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, 17 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ అంశంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా అరెస్టయిన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ పై ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు వద్ద రెండుసార్లు దాడులు జరగడం, పోలీసులు భద్రత కల్పించినప్పటికీ ఇలా జరగడంపై రాష్ట్రపతికి వివరించనున్నారు. ఇక అతనిపై నమోదు చేసిన దేశద్రోహం కేసు, జేఎన్ యూలో రేగిన వివాదంపైనా ప్రణబ్ కు రాహుల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలపనున్నారు. ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.