: వీడియోలో ఆడియో మిస్!... కన్నయ్యపై దేశ ద్రోహం అభియోగాల ఉపసంహరణ?
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కేంద్ర బిందువుగా మారిన వర్సిటీ స్టూడెంట్ యూనియన్ నేత కన్నయ్య కుమార్ పై ఢిల్లీ పోలీసులు దేశ ద్రోహం అభియోగాలు మోపారు. భారత పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా మొన్న వర్సిటీలో జరిగిన ర్యాలీలో కన్నయ్య దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. పోలీసులకు చిక్కిన వీడియోలో కన్నయ్య ఆ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై దేశ ద్రోహం కింద కేసులు పెట్టారు. నిన్న రాత్రి ఆయనను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ‘ద హిందూ’ పత్రిక నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. ఈ నెల 9న వర్సిటీలో ర్యాలీ జరిగింది. ర్యాలీలో కీలకంగా వ్యవహరించిన కన్నయ్య కుమార్ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి చెందిన వీడియో అటు పోలీసులతో పాటు ఇటు మీడియా చేతికి కూడా చిక్కింది. ర్యాలీలో పాల్గొన్న కన్నయ్య... వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆడియోలో మాత్రం ఆయన స్వరం అంత స్పష్టంగా వినిపించడం లేదట. అంతేకాక సదరు వీడియోలోని ఆడియో మొత్తం మిస్సయిందన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో సరైన ఆధారాలు లేకుండా దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం కుదరదు. ఈ క్రమంలోనే వీడియోను మరింత క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, కన్నయ్యపై రాజద్రోహం అభియోగాలను ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని సదరు అధికారి చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.