: తేల్చిన సీబీఐ... ఇండియాలో లంచావతారుల లెక్క ఇది!
మోదీ ప్రధానిగా వచ్చిన తరువాత ఇండియాలో లంచాలు తీసుకుంటున్న వారి సంఖ్య 94 శాతం పెరిగింది. ఇది ఎవరో చెబుతున్న కాకి లెక్క కాదు. స్వయంగా సీబీఐ అధికారులు చెబుతున్న గణాంకాలివి. 2014తో పోలిస్తే, 2015లో లంచగొండి అధికారుల సంఖ్య 94 శాతం పెరిగిందని సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా వివరించారు. మొత్తం 2,200 మంది సీనియర్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ జాబితాలో ఉన్నారని, వారందరిపైనా విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇప్పటివరకూ అవినీతి ఆరోపణలపై 101 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, త్వరలోనే మరిన్ని నమోదవుతాయని తెలిపారు. "అవినీతికి వ్యతిరేకంగా సీబీఐ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా అదే చేస్తున్నాం. విచారణల్లో పారదర్శకత చూపుతున్నాం. పెండింగ్ లో ఉన్న విచారణలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం" అని సిన్హా వివరించారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టి 14 నెలలు పూర్తయిన సందర్భంగా సిన్హా మీడియాతో మాట్లాడారు. గడచిన ఐదేళ్లలోనే అత్యధికంగా 2015లో 1,044 కేసులను నమోదు చేశామని, వీరిలో నవీన్ జిందాల్, ఏ రాజా, వీరభద్ర సింగ్ వంటి రాజకీయ నేతలూ ఉన్నారని ఆయన తెలిపారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కారణంగా నమోదైన కేసుల సంఖ్య 2014తో పోలిస్తే 56 శాతం పెరిగిందని, మొత్తం 67 కేసులు నమోదయ్యాయని వివరించారు. విదేశాలతో సంబంధాలు ఉండి, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో 62 కేసుల విచారణను పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. సీబీఐలో డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల కొరత తీవ్రంగా ఉందని, నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.