: తలారి సత్యం మృతితో నాకు సంబంధం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన దళిత యువకుడు తలారి సత్యం మృతి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ ఘటనలో టీ.టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. తలారి సత్యం మృతికి, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన మండిపడ్డారు. అబద్ధాలకు పితామహుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ లు శవరాజకీయలు చేస్తున్నాయన్న జీవన్ రెడ్డి, తానే యాక్సిడెంట్ చేసి అతడిని చంపినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. ఈ వ్యవహారంలో తాను సీబీఐ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.