: బంగారం తవ్వే కాంట్రాక్టులు ప్రైవేటు సంస్థలకు... మోదీ పచ్చజెండా!
ఈ సంవత్సరం ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కనీసం మూడు బంగారు గనులను ప్రైవేటు సంస్థలకు వేలం విధానంలో అప్పగించాలని భావిస్తున్నట్టు మోదీ సర్కారు నిర్ణయించింది. దీనివల్ల సాలీనా 36 బిలియన్లకు (సుమారు రూ. 2.5 లక్షల కోట్లు) పెరిగిన బంగారం దిగుమతి మొత్తాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గనుల శాఖ కార్యదర్శి బల్వీందర్ కుమార్ వివరించారు. కాగా, ఓ 1000 టన్నుల బంగారం ఇండియాకు దిగుమతి అవుతుందని భావిస్తే, అది వార్షిక ద్రవ్యలోటులో పావు భాగానికి సమానం. ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో స్మగ్లర్లు కూడా అంతే స్థాయిలో అక్రమంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతులు ఆపి డిమాండ్ తగ్గట్టుగా సరఫరా చేయాలంటే గనుల తవ్వకమే మార్గమని భావిస్తున్నట్టు కుమార్ తెలిపారు. కాగా, వేలం వేసే గనుల్లో 15 ఏళ్ల క్రితం మూతబడ్డ కర్ణాటకలోని కోలార్ గనులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నో స్థానిక, విదేశీ కంపెనీలు ఈ గనులను కాంట్రాక్టుకు తీసుకునేందుకు ఆసక్తి చూపాయని వెల్లడించిన కుమార్, వాటి పేర్లను చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. బంగారం గనులకు కోలార్ శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ప్రభుత్వం, ఆపై భారత్ గోల్డ్ మైన్స్ ఈ గనులను నిర్వహించాయి. 2001లో దీన్ని మూసివేయగా, ఇంకా కనీసం 280 టన్నుల బంగారం గనుల్లో ఉండవచ్చని అంచనా. ఈ గనికి రూ. 6 వేల కోట్ల వరకూ ధర పలకవచ్చని భావిస్తున్నట్టు కుమార్ వెల్లడించారు.