: ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతా: వైఎస్ జగన్
తమ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారని, ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్య వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానని, వారి పేర్లు చెప్పిన ఒక్క గంటలోనే బాబు సర్కార్ పడిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు తన కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ఏమని చెబుతారంటే.. ఎమ్మెల్యేలను కొనమని చెబుతారు. చంద్రబాబు దగ్గర నల్లధనం బాగా ఉంది. కనుక ఏదైనా చేయగలడు. చంద్రబాబుకు ఒక చెడ్డ అలవాటు ఉంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ ప్రచారాలు చేస్తాడు. ఆయనకు కొద్దోగొప్పో మీడియా మద్దతు ఉంది కనుక, ఆ వార్తలు పేపర్లలో రాస్తారు. టీవీల్లో చూపిస్తారు. దీని ప్రభావంతో మా ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా విలేకరుల సమావేశాలు నిర్వహించి చంద్రబాబును తిట్టడం జరుగుతోంది. అసలు బుద్ధి ఉన్నవాళ్లెవరైనా టీడీపీలో చేరతారా?’ అంటూ జగన్ ప్రశ్నించారు.