: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలని గవర్నర్ ను కోరాం: జగన్
నాలుగు ప్రధాన అంశాలపై ఫిర్యాదు చేసేందుకుగాను ఈ రోజు తాము గవర్నర్ నరసింహన్ ను కలిశామని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు. వాటికి సంబంధించి లేఖలు కూడా అందించామని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలసి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ముందుగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రస్తావించామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే సీఎం కేసీఆర్ టెండర్లు పిలిచేందుకు సిద్ధం అయ్యారని, ఒకవేళ ఆ ప్రాజెక్టు గనుక మొదలై, 90 టీఎంసీల నీరు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా మళ్లిస్తే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లందని పరిస్ధితి వస్తుందని గవర్నర్ కు వివరించామని తెలిపారు. అంతేగాక శ్రీశైలం ప్రాజెక్టుకు, దాని తరువాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా నీళ్లు అందని పరిస్థితి వస్తుందని చెప్పామని జగన్ వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉన్న ఆయకట్టు మొత్తం చాలా ఇబ్బందిపడవలసి వస్తుందని, కాబట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆపివేయించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టును ఆపించాల్సిన సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాజీ పడి, ఓటుకు నోటు కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రాజెక్టును ఆపించకుండా ఉన్నారని జగన్ ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన ట్రైబ్స్ సలహా కమిటీపై కూడా గవర్నర్ కు తెలిపామన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ఘటనలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారని, తప్పుడు కేసులు పెడుతున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.