: మార్కెట్ లో కి హైడ్రోజన్ కారు 'రస'


బ్రిటన్ మార్కెట్ లోకి ఆధునిక హంగులతో హైడ్రోజన్ కారు ప్రవేశించింది. రెండు సీట్ల సామర్థ్యం గల ఈ కారులో గేర్లు ఉండవు. ముందుకు, వెనుకకు వెళ్లేందుకు, న్యూట్రల్ లో ఉండేందుకు మూడు బటన్లు ఉంటాయి. కాళ్ల దగ్గర యాక్సిలరేటర్, బ్రేకులు ఉంటాయి. ఈ కారు కేజీన్నర హైడ్రోజన్ ఇంధనంతో 482 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పది సెకెన్లలో గరిష్ఠంగా 97 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. దీని రెండు వైపుల డోర్లు పైకి తెరచుకుని వుంటాయి. సీఎన్జీ ఇంధనంతో నడిచే వాహనం కంటే తక్కువ కాలుష్యం విడుదల చేయడం ఈ కారు ప్రత్యేకత, వేగంగా వెళ్తున్నప్పుడు ఈ కారు నుంచి నీటి రూపంలో వచ్చే కాలుష్యం ఆవిరిగా విడుదల కాగా, స్లోగా వెళ్లేప్పుడు నీటి బొట్లుగా కారుతుంది. దీంతో ఆ కారుకు లాటిన్ పదం 'రస' అని పేరు పెట్టారు. 'రస' అంటే లాటిన్ లో స్వచ్ఛమైన అని అర్ధం. పెట్రోల్, డీజిల్ వాహనాలు ప్రమాదానికి గురైతే ఇంధనం కారిపోతుందని, అదే హైడ్రోజన్ అయితే గాలిలో కలిసిపోతుందని ఈ కారును తయారు చేసిన రివర్ సిపిల్ మూవ్ మెంట్ ప్రతినిధులు తెలిపారు. 580 కేజీల బరువుండే ఈ కారును పటిష్ఠమైన మెటీరియల్ తో తయారు చేశామని వారు వెల్లడించారు. ఈ కారును కొంటే నిర్వహణ, మరమ్మతులు, బీమా ఉచితంగా అందజేస్తామని వారు చెప్పారు. దీని ధర ఫోక్స్ వాగన్ గల్ఫ్ కారు ధర అంత ఉంటుందని వారు వెల్లడించారు. అయితే బ్రిటన్ లో ప్రస్తుతానికి హైడ్రోజన్ ఇంధనం అందజేసే బంకులు కేవలం 14 మాత్రమే ఉన్నాయి, త్వరలో మరో 12 బంకులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ అందుబాటులో వస్తే ఈ కార్లకు మరింత ఆదరణ లభించే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News