: పాక్ తో డీల్ పై ఇండియాకెందుకు బాధ?: అమెరికా
పాకిస్థాన్ కు ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయాన్ని సమర్థించుకున్న అమెరికా, ఈ విషయంలో ఇండియాకు బాధ ఎందుకని ప్రశ్నించింది. తమకు, పాక్ కు కుదిరిన డీల్ పై భారత్ చింతించాల్సిన అవసరం లేదని, ఉపఖండంలో భద్రతను పరిగణనలోకి తీసుకున్న అనంతరమే డీల్ కు ఓకే చెప్పామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ వ్యాఖ్యానించారు. ఎఫ్-16 విమానాల విక్రయాన్ని భారత్ ఆక్షేపించిన విషయమై ఆయన్ను ప్రశ్నించగా, పాక్ లో ఉగ్రవాద మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ డీల్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. పాక్ తో, భారత్ తో తమకున్న అనుబంధాలు వేర్వేరని వ్యాఖ్యానించిన ఆయన, టెర్రరిస్టులను హతమార్చేందుకు పాక్ కు సహకరిస్తామని స్పష్టం చేశారు. కాగా, అణ్వాయుధాలను మోసుకు వెళ్లే సామర్థ్యమున్న 8 విమానాలను విక్రయించేందుకు ఈ నెల 13న డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ లో యూఎస్ ప్రతినిధి రిచర్డ్ వర్మను పిలిపించిన ప్రభుత్వం, ఆయనకు నిరసనను కూడా తెలిపింది.