: రూర్కెలా ఉగ్రవాదులు... సూర్యాపేట షూటర్స్ జట్టు సభ్యులే!
నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒడిశాలోని రూర్కెలాలో పట్టుబడ్డ ఉగ్రవాదులు... గతంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో షూటింగ్ జరిపి, ఆ తర్వాత రోజుల తరబడి టెన్షన్ వాతావరణం నేపథ్యంలో జానకిపురంలో జరిగిన పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదుల సన్నిహితులేనట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిన్న రాత్రి తెలంగాణ పోలీసులు ఒడిశా పోలీసులతో కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్ లో నలుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వీరి నుంచి తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉగ్రవాదుల వివరాలపై ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. నాడు సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులకు తెగబడి... జిల్లాలోని నిర్జన ప్రదేశంలో తలదాచుకుని పోలీసులకు సవాల్ విసిరిన ఇద్దరు ఉగ్రవాదుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి 2013లో తప్పించుకున్న ఆరుగురు ఉగ్రవాదులు నాటి నుంచి పరారీలో ఉన్నారు. వారిలో ఇద్దరు సూర్యాపేటలో కాల్పులు జరిపి ఆ తర్వాత జానకిపురంలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. తాజాగా నిన్న రాత్రి ఆ ముఠాలో మిగిలిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అంజాద్, జకీర్, మహబూబ్, సాలిక్ లుగా గుర్తించారు.