: రాజన్ కు షాకిచ్చిన సుప్రీం... రుణ ఎగవేతదారు జాబితా ఇవ్వాలంటూ నోటీసులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురాం రాజన్ కు సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం షాకిచ్చింది. మొండి బకాయిలను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకుల నుంచి అప్పనంగా రుణాలను అందుకుని, ఆ తర్వాత వాటి చెల్లింపులో శ్రద్ధ పెట్టకుండా అక్రమార్కులు ప్రజల సొమ్మును జేబుల్లో వేసుకుంటే, ఆ రుణాలను మొండి బకాయిలుగా తేల్చేసి ఎలా రద్దు చేస్తారని రాజన్ ను నిలదీసింది. అయినా బ్యాంకులకు అక్రమార్కులు రుణాలను ఎగవేస్తూ ఉంటే, మీరేం చేస్తున్నారని నిలదీసింది. ఆయా బ్యాంకులకు, ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.500 కోట్లు, ఆపై రుణాలను ఎగవేసిన అక్రమార్కుల జాబితాను అందజేయాలని రాజన్ కు ఆదేశాలు జారీ చేసింది.