: చంద్రబాబును కలసిన ఎమ్మెల్యే వంశీ... రామవరప్పాడు బాధితుల సమస్య సీఎం దృష్టికి!
కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రామవరప్పాడులో ఇళ్లు కోల్పోతున్న బాధితుల సమస్యలను ఆయన సీఎంకు వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం భూసేకరణ చేయాల్సి ఉంటుందని, బాధితులకు తప్పకుండా పరిహారం చెల్లిస్తామని వంశీకి సీఎం హామీ ఇచ్చారు. ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండురోజుల కిందట రామవరప్పాడులో ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న పూరి గుడిసెలను అధికారులు తొలగిస్తుండగా బాధితులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న క్రమంలో ఎమ్మెల్యే వంశీ బాధితులకు అండగా నిలిచారు. తరువాత వారితో కలసి ధర్నాకు దిగారు. దాంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో నిరసనగా వంశీ తన గన్ మెన్లను వెనక్కి తిప్పి పంపించారు. మళ్లీ ప్రభుత్వం వారిని ఆయన వద్దకే పంపింది. దాంతో రెండు రోజుల పాటు వంశీకి, ప్రభుత్వానికి మధ్య చిన్నపాటి గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ వంశీ సీఎంను కలవడం గమనార్హం.