: సత్తా చాటిన హరీశ్ రావు!... ఖేడ్ లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటున్న టీఆర్ఎస్
టీఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల తారకరామారావు మాదిరే.. ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా సత్తా చాటారు. ‘గెలుపు సారధి’గా పేరొందిన ఆయన మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో తన పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను చేజిక్కించుకుని ఆయన టీఆర్ఎస్ అభ్యర్థికి ఘన విజయం సాధించి పెడుతున్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డికి ఇప్పటికే భారీ మెజారిటీ వచ్చేసింది. నేటి ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కొద్దిసేపటి క్రితం 18 వ రౌండ్ ముగిసేసరికి 82,009 ఓట్లు సాధించిన భూపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిపై 47,495 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. సంజీవరెడ్డికి 34,514 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ తరఫున బరిలోకి దిగిన విజయపాల్ రెడ్డికి 13,259 ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో భూపాల్ రెడ్డి విజయం ఖరారైపోయింది. ఇక మెజారిటీ మాత్రమే తేలాల్సి ఉంది. భూపాల్ రెడ్డి విజయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.