: రానున్న కాలంలో భారత్, చైనా, అమెరికాల్లో మంచినీటికి కటకట
భారత్, చైనా, అమెరికా ఇతర దేశాల్లో మంచినీటికి తీవ్ర కొరత ఏర్పడనుందని 'సైన్స్ అడ్వాన్సెస్' పత్రిక ప్రకటించింది. నెల నుంచి మూడు నెలలపాటు తీవ్ర మంచినీటి ఎద్దడితో నాలుగు వందల కోట్ల మంది ప్రజలు అల్లాడిపోయే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆ పత్రిక వెల్లడించింది. ఈ నాలుగు వందల కోట్ల మందిలో రెండు వందల కోట్ల మంది ప్రజలు కేవలం భారత్, చైనాలకు చెందినవారేనని ఈ పత్రిక ప్రకటించింది. అమెరికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాల్లో మరో రెండు వందల కోట్ల మంది మంచినీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆ పత్రిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది ప్రజలు ఏడాది పొడుగునా నీటి ఎద్దడి ఎదుర్కొంటారని, వారు భారత్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, యెమన్ తదితర ప్రాంతాలకు చెందిన వారని ఆ పత్రిక వెల్లడించింది. గతంలో ఏడాది కాలానికి వేసిన అంచనాల్లో 170 నుంచి 300 కోట్ల మంది ప్రజలు నీటి ఎద్దడికి గురి కానున్నారని పేర్కొనగా, తాజా అంచనాలు నెల ప్రాతిపదికన తీసుకుని 12 నెలలకు లెక్కగట్టినవని ఆ పత్రిక పేర్కొంది. నీటి ఎద్దడి వల్ల మానవాభివృద్ధి కుంటుపడనుందని ఆ పత్రిక స్పష్టం చేసింది. భవిష్యత్ లో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, మంచినీటి వనరులను అభివృద్ధి చేసుకోవడం మానవాళికి అతిపెద్ద సవాల్ అని ఆయన చెప్పారు. వాతావరణంలో ఊహించని మార్పులు కూడా మంచినీటి ఎద్దడికి కారణం కానున్నాయని ఆ పత్రిక తెలిపింది.