: గాంధీకి 'మహాత్మ' బిరుదు ఇచ్చింది ఓ విలేకరి: గుజరాత్ పంచాయతి శిక్షణ సమితి
జాతిపిత గాంధీ 'మహాత్మ' బిరుదుపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ మొదటిసారిగా గాంధీని 'మహాత్మ' అంటూ సంబోధించారన్నది అందరికీ తెలిసిందే. కానీ, గుజరాత్ ప్రభుత్వం మాత్రం దీనిని ఖండిస్తోంది. సౌరాష్ట్రలోని జెత్ పూర్ పట్టణానికి చెందిన ఓ విలేకరి గాంధీకి ఆ బిరుదు ఇచ్చారని అంటోంది. అదే విషయాన్ని ఇటీవల జరిగిన పరీక్షల సమాధానంలో పేర్కొనడం విశేషం. రాజ్ కోట్ రెవెన్యూ విభాగంలో కొన్ని పోస్టుల భర్తీ కోసం పంచాయతి శిక్షణ సమితి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఇందులో గాంధీకి 'మహాత్మ' బిరుదును ఎవరు ఇచ్చారు? అని ఓ ప్రశ్న ఉంది. అయితే పరీక్ష తరువాత వెలువరించిన మొదటి 'కీ'లో ఠాగోర్ అని చెప్పి, ఫైనల్ 'కీ'లో 'గుర్తు తెలియని జర్నలిస్ట్' అని పేర్కొంది. దానిని తప్పుబడుతూ సంధ్య మారు అనే అభ్యర్థిని తాజాగా గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర పంచాయతి శిక్షణ సమితి, గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే జెత్ పూర్ కు చెందిన ఓ విలేకరి 'మహాత్మ' అని సంబోధిస్తూ లేఖ రాశారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది. ఇదే విషయాన్ని గాంధేయవాది నారాయణ్ దేశాయ్ తన పుస్తకంలో పేర్కొన్నారని కూడా చెప్పింది. కానీ ఆ జర్నలిస్టు పేరు తెలియదని చెప్పడం గమనార్హం.