: నెలలో ఆరు సార్లే ఆన్ లైన్ ట్రయిన్ టికెట్ రిజర్వేషన్... నేటి నుంచి అమలు!
రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ విషయంలో దళారుల ప్రమేయానికి మరింత అడ్డుకట్ట పడేలా తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఓ యూజర్ ఐడీ నుంచి నెలలో ఆరు సార్లు మాత్రమే రైల్వే టికెట్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. గతంలో 10 లావాదేవీలు జరుపుకునే వీలుండగా, అత్యధికులు మూడు నుంచి 5 సార్లు మాత్రమే టికెట్లు కొనుగోలు చేస్తున్నారని తెలుసుకున్న రైల్వే అధికారులు, ఆన్ లైన్ లావాదేవీలను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవ రైలు ప్రయాణికులకు నెలలో ఆరుసార్లకు మించి ప్రయాణ అవసరాలు ఉండవని ఈ సందర్భంగా రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, అక్రమార్కులకు చెక్ చెప్పేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలను ఐఆర్సీటీసీ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ అడ్వాన్స్ బుకింగ్ సమయంలో ఒక యూజర్ కేవలం రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేలా ఇప్పటికే నిబంధన అమలవుతోంది. ఇక ఉదయం 10 నుంచి 12 గంటల్లోపు తత్కాల్ బుకింగునకూ ఇదే నియమం వర్తిస్తుంది. టికెట్ ఏజంట్లు ఉదయం 8 నుంచి 8:30 వరకూ, ఆపై తత్కాల్ బుకింగ్ సమయంలో ఉదయం 10 నుంచి 10:30 వరకూ ఎటువంటి బుకింగ్స్ చేయరాదు. ఇక ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ ఈ-వాలెట్, క్యాష్ కార్డుల నుంచి బుకింగ్స్ స్వీకరించరు. ఉదయం 8 నుంచి 12 గంటల్లోపు ఒక యూజర్ ఐడీ నుంచి రిటర్న్ జర్నీ లేదా, గమ్యస్థానం నుంచి మరో ప్రాంతానికి అయితే తప్ప రెండో లావాదేవీని ఐఆర్సీటీసీ స్వీకరించదు.