: క్షణాల్లో సర్వం బుగ్గి... ఎంతో భయపడ్డా: అమీర్ ఖాన్
గత రాత్రి 'మేకిన్ ఇండియా వీక్' పేరిట ముంబైలో చేపట్టిన సదస్సు వేదిక అగ్నికి ఆహుతి కావడంపై ఆ సమయంలో అక్కడే ఉన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పందించాడు. "నేను నా మేకప్ వ్యాన్ లో కూర్చున్నాను. మరో గంటలో నేను డ్యాన్స్ చేయాల్సి వుంది. ఈ లోగా మంటలు అంటుకున్నాయి. బయటకు వచ్చి చూశాను. సముద్రం నుంచి బలమైన గాలులు వేగంగా వీస్తుండటంతో మంటలు సైతం అంతే వేగంగా విస్తరించాయి. క్షణాల్లో అంతా బుగ్గిగా మారింది. ఎంతో భయపడ్డా. ఇప్పుడు నేను క్షేమం. అయితే, ఇది చాలా దురదృష్టకర ఘటన. ఘటనా స్థలి నుంచి అందరినీ తరలించిన తీరు ఎంతో ప్రశాంతంగా వేగంగా సాగింది. ముఖ్యమంత్రి ముందుండి సిబ్బందిని నడిపించారు" అని అన్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం మినహా ఎవరికీ గాయాలు కాలేదన్న సంగతి తెలిసిందే. మంటలు చెలరేగిన 30 నిమిషాల వ్యవధిలో వాటిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు.