: వెయిటింగ్ లిస్ట్ కష్టాలు తీర్చే యాప్... ఐఐటీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ పొందిన యాప్!
సికింద్రాబాద్ నుంచి పొద్దున్నే కృష్ణా ఎక్స్ ప్రెస్ ఎక్కి ఒంగోలు వెళ్లాలని భావించారనుకోండి. సికింద్రాబాద్ నుంచి రిజర్వేషన్ కు ప్రయత్నిస్తే దొరకకపోవచ్చు. అదే దాని ముందు స్టేషన్ మల్కాజ్ గిరి నుంచి చూస్తే, తప్పకుండా సీటు లేదా బెర్తు లభిస్తుంది. ఒక్క కృష్ణా ఎక్స్ ప్రెస్ మాత్రమే కాదు. అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి. ఒక స్టేషన్ నుంచి రిజర్వేషన్ లభించకపోతే, ముందు స్టేషన్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఆయా స్టేషన్ల కోటా పూర్తి కాకపోతే రిజర్వేషన్ దొరుకుతుంది. ఇక అన్ని స్టేషన్లూ వెతుక్కుంటూ వెళ్లాలంటే కొంత కష్టమే. ఈ ఆలోచనే ఓ వినూత్న, ఉపయోగకర యాప్ తయారీకి దారితీసింది. ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థి రుణాల్ రిజు, జంషెడ్ పూర్ ఎన్ఐటీ విద్యార్థి శుభం బాల్దావాలు ఈ యాప్ ను తయారు చేశారు. దీని పేరు 'టికెట్ జుగాద్'. ఐఐటీ గ్లోబల్ బిజినెస్ మోడల్ పోటీల్లో దీనికి మొదటి బహుమతి లభించింది. ఇక యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వేల సంఖ్యలో ఇప్పటికే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.