: కాకినాడలో ఎమ్మెల్సీ పుత్రరత్నం డ్రంకన్ డ్రైవ్!... స్తంభాన్ని ఢీకొన్న కారు, ముగ్గురికి గాయాలు


డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాదుకే పరిమితం కావడం లేదు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాదులో జల్సాలకు అలవాటుపడ్డ ప్రజాప్రతినిధుల పుత్రరత్నాలు తమ సొంతూళ్లలోనూ అదే తరహా సరదాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రాల్లోనూ డ్రంకన్ డ్రైవ్ కారణంగా పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ తరహా ఘటన తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకుంది. కాకినాడ చెందిన ఓ ఎమ్మెల్సీ పుత్రరత్నం ఫుల్లుగా మద్యం సేవించి కారెక్కాడట. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ అతడు కారు నడిపాడు. రోడ్డుకు ఓ చివరగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటనపై వేగంగా స్పదించిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో ఎమ్మెల్సీ పుత్రరత్నానికి గాయాలయ్యాయా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News