: భాగ్యనగరిలో కాల్ మనీ మాఫియా!... నాచారంలో వ్యక్తిపై వడ్డీ వ్యాపారి కత్తితో దాడి


ఏపీ వ్యాప్తంగా కలకలం రేపిన కాల్ మనీ సెక్స్ రాకెట్ తరహా ‘వడ్డీ’ వేధింపులు భాగ్యనగరి హైదరాబాదులోనూ చోటుచేసుకుంటున్నాయి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నగరంలోని నాచారం పరిధిలో ఈ తరహా ఘటన ఒకటి జరిగింది. అవసరం నిమిత్తం రూ.30 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తిపై అతడికి అప్పిచ్చిన వడ్డీ వ్యాపారి దాడికి దిగాడు. ఇచ్చింది రూ.30 లక్షలే అయినా, ఏకంగా రూ.కోటి చెల్లించాలంటూ వేధింపులకు గురి చేయడమే కాక నిన్న రాత్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు తీవ్రగాయాలపాలయ్యాడు. వివరాల్లోకెళితే... నాచారంలో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న కుమార్ అనే వ్యక్తి వద్ద గిరి తన అవసరాల నిమిత్తం రూ.30 లక్షల మేర అప్పు తీసుకున్నాడు. అయితే క్రమంగా వడ్డీ కడుతూనే వస్తున్న గిరిపై కుమార్ ఇటీవల వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇచ్చింది రూ.30 లక్షలే అయినా... అసలు, వడ్డీ కలుపుకుని రూ.కోటి చెల్లించాల్సిందేనని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య నిన్న రాత్రి మాటామాటా పెరిగింది. చిన్నపాటి వాగ్వాదంతోనే ఆగ్రహావేశాలకు గురైన కుమార్ కత్తి తీసుకుని గిరిపై దాడికి దిగాడు. ఈ దాడిలో గిరికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News