: మాఫియా డాన్ల గురించి నాకు ఎక్కువగా తెలిసే అవకాశముంది: వర్మ
ముంబయి మాఫియా డాన్ల గురించి తనకే ఎక్కువగా తెలిసే అవకాశముందని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. తనది రీసెర్చి ఓరియంటెండ్ మైండ్ అని, తనకున్న పరిచయాలు, వాళ్లతో మాట్లాడే తీరు, ఎటువంటి సమాచారం వాళ్ల నుంచి సేకరించగల్గుతాను? అనే విషయంలో తన ఎబిలిటీని ఆధారంగా చేసుకుని, మాఫియా డాన్ల గురించి తన కంటే వేరే వాళ్లకు ఎక్కువగా తెలిసే అవకాశముండదని చాలా మంది అనుకుంటూ ఉంటారన్నారు. 'ఇటీవల ఒక విదేశీ రచయిత ముంబయికి వచ్చి ఒక మాఫియా డాన్ గురించిన సమాచారం కావాలని అక్కడి పోలీసు అధికారులను అడుగగా, వాళ్లు మీ పేరు సూచించారట. నిజమేనా?’ అన్న ప్రశ్నకు వర్మ సమాధానమిస్తూ "పోలీసు 'అధికారులు' అనద్దు. ఎందుకంటే, జస్ట్ ఒక్క పోలీసు అధికారి మాత్రమే ఈ సూచన చేశారు. పోలీసు అధికారి అనే వాడు తన కున్న బ్రాంచ్, పరిధిలో మాత్రమే విచారణ చేయగల్గుతాడు. నేను ఒక ఫిల్మ్ మేకర్ ని, కొంత వరకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టును కూడా. ఒక అంశాన్ని నేను పలు కోణాల్లో చూస్తాను, ఆలోచిస్తాను. కనుక, దీనిని ఆధారంగా చేసుకుని ఆ అధికారి ఆ మాట అన్నాడు. నేను తీసిన సినిమాలు కూడా అలాంటివే. 'సత్య' వంటి చిత్రాలు మిగిలిన దర్శకులెవ్వరూ తీయలేదు. కనుక, పోలీసు డిపార్ట్ మెంట్ కానీ, వేరే శాఖల వాళ్లు కానీ, మాఫియా డాన్లతో నాకు ఎక్కువ సంబంధాలున్నాయని అనుకుంటారు’ అని వర్మ సమాధానమిచ్చారు.