: ద్రవ్యోల్బణానికి, దోశెకు లింకుపెట్టిన రాజన్!
దక్షిణాదిన దోశె ధర ఎందుకు తగ్గడం లేదన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నిన్న కేరళలోని కోచిలో నిర్వహించిన ఫెడరల్ బ్యాంక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థి ఆయన్ని ప్రశ్నిస్తూ, ‘ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి.. తగ్గినపుడు ధరలూ తగ్గాలిగా.. దక్షిణాది ప్రజలు ఇష్టంగా తినే దోశె ధర మాత్రం తగ్గడం లేదెందుకు?’అనే దానికి రాజన్ స్పందిస్తూ దోశె వేసే పెనాన్ని తప్పుబట్టారు. ‘పలు రకాల దోశెలు వచ్చాయి. అయినా, సాంకేతికంగా దోశె వేసే విధానం, పెనం మాత్రం మారలేదు. అయితే, దోశె వేసే వ్యక్తికి ఇచ్చే జీతం మాత్రం పెరుగుతూ పోతోంది. అందుకే, దోశె ధర ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తగ్గడం లేదు’ అని రాజన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలో సాంకేతికతను ఉపయోగించుకుని కొన్ని రంగాలు అభివృద్ధి చెందుతుండగా, మరికొన్ని రంగాలు మాత్రం తమ సాంకేతికతను మార్చుకోవడం లేదని అన్నారు. సాంకేతికతను మార్చుకోని రంగాల్లో ధరలు పెరుగుతున్నాయని..అందుకు మంచి ఉదాహరణ దోశె అని రాజన్ పేర్కొన్నారు.