: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ముఖేశ్ అంబానీ ప్రపోజ్!... హారన్ల మోతతో ఓకే చెప్పిన నీతా... ఫ్లాష్ బ్యాక్!


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల జోడి చూడముచ్చటైనదే. అప్పటికే దేశ వ్యాపార విపణిలో ఓ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయి అంబానీ... పెళ్లి విషయంలో తన పెద్ద కొడుకు ముఖేశ్ ను కానీ, చిన్న కుమారుడు అనిల్ అంబానీని కాని ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయలేదు. ముఖేశ్ అంబానీ, నీతాల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి అందరికీ తెలిసిందే. అయినా ముఖేశ్ అంబానీ లవ్ ప్రపోజల్ ను నీతా ఎలా అంగీకరించారు? ఎప్పుడు ఓకే చెప్పారు?... ఈ విషయాలన్నీ ఓ బాలీవుడ్ లవ్ స్టోరీ మాదిరే జరిగాయని చాలామందికి తెలియదు. అప్పటికే ఇరు కుటుంబాల అంగీకారంతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశంలో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అదెలాగంటే, అప్పటికే డేటింగ్ లో ఉన్నప్పటికీ విద్యాభ్యాసం ముగిసేదాకా పెళ్లి ప్రస్తావన వద్దని నీతా భావించారట. ఈ విషయాన్ని చూచాయగా గ్రహించిన ముఖేశ్ అంబానీ, ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు ఓ బ్రహ్మండమైన ప్లాన్ వేశారు. డేటింగ్ లో భాగంగా ఓ రోజు ఇద్దరూ రైడింగ్ కు వెళుతున్న సందర్భంగా ముంబైలోని పోద్దార్ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడితే, ముఖేశ్ కారు ఆపారు. వెనువెంటనే తాను ముందుగానే రూపొందించుకున్న ప్లాన్ ను అమలు చేశారు. సరిగ్గా గ్రీన్ లైట్ పడుతుందనగా... ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ నీతాకు ప్రపోజ్ చేశారట. నీతా స్పందించేలోగానే గ్రీన్ లైట్ వెలగడం, వారి కారు వెనుక ఉన్న కార్ల నుంచి హారన్లు మోగడం ప్రారంభమైంది. దీంతో కాస్తంత గాభరా పడ్డ నీతా... ‘ముందు కారు స్టార్ట్ చెయ్యి. లేదంటే ట్రాఫిక్ జామ్ ఖాయం’అని చెప్పారు. అయితే తన ప్రతిపాదనకు సమాధానమిస్తేనే, కారు స్టార్ట్ చేస్తానని ముఖేశ్ మొండికేశారు. విద్యాభ్యాసంతో పెళ్లి వాయిదా వేయాలనుకున్న నీతాకు... ముఖేశ్ అంటే ఇష్టమే. దీంతో చేసేదేమీ లేక ఆమె నోట ‘ఎస్’ అనే మాట రావడం, ముఖేశ్ కారు స్టార్ట్ చేయడం జరిగిపోయాయి. వెనువెంటనే వారి పెళ్లి కూడా జరిగిపోయింది.

  • Loading...

More Telugu News