: ప్రేమికుల రోజాలకు ఎంత డిమాండో!
మరో రెండు రోజుల్లో రానున్న వాలెంటెయిన్స్ డే నేపథ్యంలో ప్రేమికుల రోజాలకు డిమాండ్ ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది భారత్ నుంచి యూరప్ ప్రాంతానికి ఎగుమతి చేసే గులాబి పూల పరిమాణం పది శాతం పెరగగా, ధర కూడా అంతే మొత్తం పెరిగినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 19 మిలియన్ల గులాబీలను (కాడతో పాటుగా ఉన్నవి) ఎగుమతి చేశారు. గత ఏడాదితో పోలిస్తే రెండు మిలియన్ల గులాబీలను ఎక్కువగా ఎగుమతి చేశామని భారత్ కు చెందిన పూల వ్యాపారి ప్రవీణ్ శర్మ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలోని పూణె-నాసిక్-కొల్హాపూర్, కర్ణాటకలోని బెంగళూరు, హోసూరుతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి గులాబీల ఎగుమతికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. సేంద్రీయ గులాబీల విషయానికొస్తే గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేశవాళీ మార్కెట్ బాగా ఉంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న గులాబీ పూలలో 55 శాతం బెంగళూరు నుంచే రవాణా అవుతున్నాయి. ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి 45 శాతం గులాబీలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.