: బీజేపీలోకి ఆప్ యువనేత?... బర్త్ డే వేడుకకు దోవల్, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు.. డుమ్మా కొట్టిన కేజ్రీ
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ విసురుతున్న ‘ఆకర్ష్’ వలతో టీడీపీ, కాంగ్రెస్ విలవిల్లాడుతున్నాయి. ఈ తరహాలోనే తమకు కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ముప్పుతిప్పులు పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న ‘కమలం’ పార్టీ బీజేసీ ప్లాన్ రచించిందా? అంటే... బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమాన్ని పరిశీలిస్తే, అవుననే చెప్పక తప్పదు. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్, సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడికెళ్లినా, ఆయన వెన్నంటె వెళ్లారు ఆ పార్టీ యువ నేత కుమార్ విశ్వాస్. అంతేకాక, ఆయా కార్యక్రమాల్లో కేజ్రీ కంటే విశ్వాసే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా బుధవారం రాత్రి తన బర్త్ డే సందర్భంగా కుమార్ విశ్వాస్ ఓ పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి కేజ్రీ హాజరు కాలేదు కానీ... బీజేపీ, ఆరెస్సెస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా క్యూ కట్టారు. ఈ పార్టీకి మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఇక ఆ పార్టీకి వెళ్లిన బీజేపీ నేతల లిస్టు పరిశీలస్తే... కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, మనోజ్ తివారీ, విజయ్ గోయల్, సుదాంశు త్రివేదీ తదితరులున్నారు. ఆరెస్సెస్ ప్రముఖులు రామ్ లాల్, ఓమ్ మాథుర్ లు కూడా ఈ వేడుకలో తళుక్కుమన్నారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కమల్ నాథ్, రాజీవ్ శుక్లా, నవీన్ జిందాల్ లు కూడా ఆ పార్టీకి అటెండైన వారిలో ఉన్నారు. ఇక ఆప్ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సొంత పార్టీ నేతలు పలుచగా కనిపించగా, ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం, ఆరెస్సెస్ నేతలు కూడా ఆ వేడుకకు హాజరైన నేపథ్యంలో విశ్వాస్ త్వరలోనే బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.