: ఊపిరి పీల్చుకున్న పోలీసులు... స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి క్షేమం!


బుధవారం నుంచి అదృశ్యమై, పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా క్షేమంగానే ఉంది. హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను గుర్తించారు. దీప్తి బుధవారం రాత్రి విధుల అనంతరం మెట్రోలో ఘజియాబాద్ చేరుకుని అక్కడ రాత్రి 8 గంటల సమయంలో ఆటో ఎక్కిన తరువాత, ఆమె తన సోదరితో ఫోన్ మాట్లాడుతూ అరవడం, ఆమె అరుస్తుండటాన్ని కొందరు చూడడం, ఆపై ఆటో జాడ తెలియకపోవడం, ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని అన్ని కోణాల నుంచి విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో దీప్తి క్షేమంగా ఉండాలంటూ ట్వీట్లూ వెల్లువెత్తాయి. యూపీ పరిధిలో ఘటన జరగడంతో ముఖ్యమంత్రి అఖిలేష్ సైతం స్పందించారు. ఆటో దారి మళ్లిన ప్రాంతంలో నిన్న ఆమె సిమ్ కార్డు లభించడంతో ఘోరం జరిగి వుండవచ్చన్న అనుమానాలూ తలెత్తాయి. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి అణువణువూ గాలించిన పోలీసులు చివరకు ఆమె పానిపట్ లో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇక ఆమే అక్కడకు వెళ్లిందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. "నా బిడ్డ సురక్షితంగా ఉంది. ఆమె వచ్చిన తరువాత ఏం జరిగిందన్నది తెలుసుకుంటాం. ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కడకు తీసుకువెళ్లాడో అడుగుతాం. ఇప్పటికి ఇంతకన్నా చెప్పేదేమీ లేదు" అని దీప్తి తల్లి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News