: అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని వేలానికి పెట్టిన ఆంధ్రా బ్యాంకు... రూ.25 కోట్ల డిపాజిట్ తో బిడ్లకు ప్రకటన


అగ్రిగోల్డ్ కేసులో నిన్న రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో బ్రాంచ్ కార్యాలయాలు తెరచి వేలాది మంది మధ్య తరగతి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం వారిని నట్టేట ముంచింది. ఈ కేసులో నత్తనడకన సాగుతున్న సీఐడీ దర్యాప్తుపై గత వారం జరిగిన విచారణ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నేడు మరోమారు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకటశేష నారాయణరావులను అరెస్ట్ చేశారు. ఇక అగ్రిగోల్డ్ కు కోట్లాది రూపాయల అప్పులిచ్చిన ఆంధ్రా బ్యాంకు కూడా రంగంలోకి దిగేసింది. హైదరాబాదులోని పంజాగుట్ట పరిధిలోని ఆ సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేసింది. తనకు రూ.107 కోట్ల మేర బకాయిపడ్డ అగ్రిగోల్డ్ యాజమాన్యం అప్పు తీర్చడంలో విఫలమైందని పేర్కొన్న ఆంధ్రా బ్యాంకు విజయవాడ బ్రాంచి సదరు కార్యాలయాన్ని వేలానికి పెడుతున్నట్లు ప్రకటించింది. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.25 కోట్ల డిపాజిట్ చెల్లించి బిడ్లను దాఖలు చేయాలని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News