: అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండీ అరెస్ట్... నేడు ఏలూరు కోర్టుకు తరలింపు


మాయ మాటలతో మధ్య తరగతి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ పోలీసులు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కీలక అడుగు వేశారు. సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషు నారాయణరావులను అరెస్ట్ చేశారు. డిపాజిట్ల పేరిట వేలాది కోట్ల రూపాయలను సేకరించిన అగ్రిగోల్డ్, మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లకు డబ్బులు చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో బాధితుల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు అగ్రిగోల్డ్ కార్యాలయాలను సీజ్ చేశారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డిపాజిటర్ల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను సేకరించారు. భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలకు కేంద్రబిందువుగా మారిన ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కేసు విచారణ చేపట్టిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు... అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు యత్నించింది. అయితే తెర వెనుక ఉండి ఆస్తుల వేలాన్ని అడుగడుగునా అడ్డుకున్న అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఇటీవలి విచారణ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక, ఇంతటి పెద్ద కేసులో ఇప్పటిదాకా ఒక్క అరెస్ట్ కూడా లేకపోవడంపై సీఐడీ దర్యాప్తుపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. కేసును సీబీఐకి అప్పగించే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ దరిమిలా కోర్టులో నేడు విచారణ జరగనుంది. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకున్న సీఐడీ అధికారులు నిన్న రాత్రి ఊహించని విధంగా సంస్థ చైర్మన్, ఎండీలను అరెస్ట్ చేశారు. నేటి ఉదయం వీరిద్దరినీ పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు. సంస్థ చైర్మన్, ఎండీల అరెస్ట్ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు ఇకపై వేగం పుంజుకోనుంది.

  • Loading...

More Telugu News