: ఆ ముగ్గురిని సస్పెండ్ చేసిన టీడీపీ... టీ టీడీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి
‘సైకిల్’ పార్టీకి షాకిచ్చి, టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్, వివేకానంద గౌడ్ లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిన్న రాత్రి ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి చంద్రబాబు ఓ ప్రకటనను విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంగానే వారిపై సస్పెన్షన్ వేటు విధిస్తున్నట్లు సదరు ప్రకటనలో చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి పార్టీకి హ్యాండిచ్చిన నేపథ్యంలో టీ టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఆ పదవిలో నియమించాలని కూడా చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. ఎర్రబెల్లి తదితరులను పార్టీ నుంచి బహిష్కరించిన విషయాన్ని కూడా చంద్రబాబు సదరు లేఖలో ప్రస్తావించారు.