: కేంద్ర మంత్రిపై కేసు వేస్తా...ఓడిపోతే ఆ వివరాలన్నీ సోషల్ మీడియాలో పెడతా: శివాజీ


కేంద్ర మంత్రి అవినీతి ఆస్తులపై హైకోర్టులో కేసు వేసి, సీబీఐ దర్యాప్తు కోరతానని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారం చేపట్టేవరకు అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర మంత్రి ఆస్తులు అకస్మాత్తుగా పెరిగాయని ఆరోపించారు. బీజేపీ అధికారం చేపట్టిన తరువాత ఆ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులోకి ధనప్రవాహం పెరిగిందని ఆయన చెప్పారు. వీటన్నింటిపైనా సీబీఐ దర్యాప్తు చేపడితే ట్రస్టు ముసుగులో పెద్దమనుషులు వెలగబెట్టే నిర్వాకాలు బట్టబయలవుతాయని శివాజీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారిపై కేసులు వేస్తే విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ అని తనకు తెలుసని ఆయన అన్నారు. ఒకవేళ తాను ఓటమిపాలైతే తాను ఇప్పటివరకు సేకరించిన వివరాలను సోషల్ మీడియాలో పెడతానని, తద్వారా ప్రజల్లోకి వెళ్తానని శివాజీ తెలిపారు. పలు పార్టీల నేతలు చెబుతున్నట్టు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసినది నేరమైతే, ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి చేస్తున్నది కూడా నేరమేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News