: కేంద్ర ఖజానాకు లక్ష్యాన్ని మించిన ఆదాయం!
చాలా సంవత్సరాల తరువాత పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ఆదాయపు పన్ను శాఖ అధిగమించనుంది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల ఆదాయం దాదాపు రూ. 40 వేల కోట్లు అదనంగా వసూలవుతుందని భావిస్తున్నామని అన్నారు. మొత్తం మీద టాక్స్ రెవెన్యూ లక్ష్యాన్ని 100 శాతం అందుకుంటామని, పన్ను విభాగానికి చెందినంతవరకూ 2015-16 ఓ విజయవంతమైన సంవత్సరమని అన్నారు. కాగా, అంతకుముందు రెండేళ్లూ పన్ను వసూలు లక్ష్యాలను ఆదాయపు పన్ను శాఖ చేరుకోలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్యాన్ని కుదించిన కేంద్రం, మొత్తం రూ. 14.99 లక్షల కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయాలని, అందులో రూ. 7.97 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు (కార్పొరేట్, ఆదాయపు పన్ను), రూ. 6.47 లక్షల కోట్లు పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, సేవా పన్ను) రూపంలో ఉంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రూ. 7.05 లక్షల కోట్ల ప్రత్యక్ష, రూ. 5.42 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలయ్యాయి.