: ఫలించిన ‘గద్దె’ మంత్రాంగం... సెల్ టవర్ దిగిన రవితేజ
కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విజయవాడలోని రామవరప్పాడులో సెల్ టవర్ ఎక్కిన ఇంజనీరింగ్ విద్యార్థి రవితేజ ఎట్టకేలకు కిందకు దిగాడు. కులాల ప్రాతిపదికన కల్పిస్తున్న రిజర్వేషన్ల స్థానంలో పేదరికం ప్రాతిపదికన కొత్తగా రిజర్వేషన్లను అమలు చేయాలని నేటి ఉదయం రవితేజతో పాటు కొంత మంది విద్యార్థులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆందోళనకు ముందే రవితేజ రామవరప్పాడులోని సెల్ టవర్ ఎక్కి కలకలం రేపాడు. కిందకు దిగిరావాలన్న అగ్నిమాపక సిబ్బంది విజ్ఞప్తిని రవితేజ తిరస్కరించాడు. అయితే సమాచారం అందుకున్న టీడీపీ సీనియర్ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రవితేజ ఇచ్చిన సెల్ ఫోన్ నెంబరుకు ఫోన్ చేసిన ఆయన అతడితో మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్న గద్దె హామీతో సంతృప్తి వ్యక్తం చేసిన రవితేజ సెల్ టవర్ దిగాడు.