: కిడ్నాపర్లను బురిడీ కొట్టించిన కుర్రాడు
నిండా పన్నేండేళ్లు కూడా లేని ఓ చిన్న కుర్రాడు కాకలు తీరిన కిడ్నాపర్లను బురిడీ కొట్టించాడు. తనను బలవంతంగా ఎత్తుకెళుతున్న కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుని తల్లిదండ్రుల చెంతకు చేరాడు. నల్లగొండ జిల్లా భువనగిరిలో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... భువనగిరిలోని అర్బన్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కొడుకు అరుణ్ సాయి స్థానికంగా ఉన్న దేదీప్య హైస్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. నేటి ఉదయం తన ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని ఎత్తుకుని కిడ్నాపర్లు తాము వచ్చిన వ్యాన్ లోనే వేగంగా అక్కడి నుంచి మాయమయ్యారు. భువనగిరి సమీపంలోని రాయగిరి వద్దకు చేరుకోగానే వ్యాన్ చెడిపోయింది. ఆందోళనకు గురైన కిడ్నాపర్లంతా వ్యాన్ దిగి ఏమైందోనని చూడటంలో మునిగిపోయారు. ఇదే అదనుగా భావించిన అరుణ్ సాయి ఒక్క ఉదుటన వ్యాన్ నుంచి కిందకు ఉరికి, పరుగు లంకించుకున్నాడు. రాయగిరి గ్రామంలోకి ప్రవేశించాడు. బాలుడు తప్పించుకోవడంతో కంగుతిన్న కిడ్నాపర్లు అక్కడి నుంచి కాళ్లకు బుద్ధి చెప్పక తప్పలేదు. గ్రామంలోకి చేరిన అరుణ్ సాయి అక్కడి ఓ వ్యక్తి సహకారంతో తన తల్లిదండ్రులకు సమాచారం చేరవేశాడు. ఆందోళనకు గురైన అతడి తల్లిదండ్రులు పరుగున వచ్చి బాలుడిని చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అరుణ్ సాయి నుంచి వివరాలు సేకరించి కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించారు.