: ఆసనాలకు అడ్డురాని అంగవైకల్యం!


21 సంవత్సరాల తేజస్వి శర్మ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ)లో జర్మన్ స్టడీస్ లో ఫైనలియర్ చదువుతున్నాడు. బీహార్ కు చెందిన శర్మ చిన్నతనంలో పోలియో మహమ్మారి బారిన పడటంతో తన రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. సుమారు 69 శాతం అంగవైకల్యం కల్గి ఉన్న శర్మ గురించి చెప్పుకోవాల్సిన గొప్ప విషయమేమిటంటే, ఇతను యోగ ఛాంపియన్! ఎంత కష్టమైన యోగాసనాన్ని అయినా అవలీలగా వేసేస్తాడు. భజరంగాసనం, భూనమనాసనం, వృశ్చికాసనం వంటి ఆసనాలు వేయడం అతనికి కొట్టిన పిండి. అందుకే, యోగలో ప్రపంచ రికార్డు నెలకొల్పి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంతర్జాతీయ యోగ ఛాంపియన్ షిప్ తో పాటు వరల్డ్ కప్ యోగ(2011)లో సిల్వర్ మెడల్, 2012లో హాంకాంగ్ లో నిర్వహించిన యోగ పోటీల్లో బంగారు పతకం, గత ఏడాది చైనాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానాన్ని శర్మ కైవసం చేసుకున్నాడు. యోగాకు అనుకూలమైన శరీరాకృతి ఉన్న శర్మను మోస్ట్ ఫ్లెక్సిబుల్ హ్యాండీక్యాప్డ్ యోగ ఛాంపియన్ గా అభివర్ణిస్తారు. ఈ సందర్భంగా తేజస్వి శర్మ మాట్లాడుతూ, తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి యోగాసనాలు సాధన చేస్తున్నానని చెప్పాడు. పోలియోతో తన రెండు కాళ్లు చచ్చుబడిన తర్వాత .. యోగ సాధన చేస్తే కర్రల సహాయం లేకుండా నడవవచ్చని వైద్యులు తనకు సూచించారన్నారు. విదేశీ భాష నేర్చుకోవడానికి ఏదైనా కారణముందా? అన్న ప్రశ్నకు తేజస్వి శర్మ సమాధానమిస్తూ, అంతర్జాతీయ యోగ పోటీల్లో పాల్గొనేందుకే తాను వెళుతుంటానని, ఆ సందర్భాలలో ఇటువంటి భాష ఒకటి వచ్చి ఉంటే మరింత ఉపయోగం ఉంటుందని చెప్పాడు. కాగా, యోగలో దూసుకెళ్తున్న తేజస్వి శర్మ తమకు స్ఫూర్తినిస్తున్నాడని జేఎస్ యూ విద్యార్థులు ప్రశంసించారు.

  • Loading...

More Telugu News