: డాక్టర్ శశికుమార్ మృతి కేసులో చంద్రకళ వాంగ్మూలమిదే...!
హైదరాబాదు హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 లో కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్న ఫాంహౌస్ యజమాని చంద్రకళ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు వాంగ్మూలమిస్తూ...సోమవారం సాయంత్రం ఉదయ్ కుమార్ పై కాల్పులు జరిపిన అనంతరం శశికుమార్ తన వద్దకు వచ్చాడని...తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని చెప్పాడని తెలిపారు. ఫాం హౌస్ కు తీసుకెళ్లాలని కోరడంతో తన కారులో ఫాం హౌస్ కు తీసుకెళ్లానని ఆమె వెల్లడించారు. ఫాం హౌస్ లో జాగ్రత్తగా చూసుకోవాలని వాచ్ మెన్ శంకరయ్యకు చెప్పి ఇంటికి రాగా, రాత్రి పది గంటల సమయంలో శశికుమార్ ఫోన్ చేశారని అన్నారు. ఈ సందర్భంగా పది నిమిషాల పాటు మాట్లాడగా, ఆఖర్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేశారని చెప్పారు. దీంతో, వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి ఫాం హౌస్ కు వచ్చానని, అప్పటికే శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆమె తెలిపారు.