: హక్కులను లాగేసుకుంటే ఎలా?: కేంద్రంపై కమలహాసన్ విసుర్లు!


భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకున్న వాక్ స్వాతంత్య్రపు హక్కు హరించుకుపోయే ప్రమాదం రాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు)కు తీసుకురావాల్సిన సంస్కరణలపై ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఉన్న కమల్ మాట్లాడుతూ, గతంలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలో ఉన్నప్పుడు, ఇండియాలో అత్యయిక స్థితిని విధించినప్పుడు ఇలాగే వాక్ స్వాతంత్య్రాన్ని ప్రజలకు దూరం చేశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడా పరిస్థితి తిరిగి తలెత్తరాదని పేరు వెల్లడించకుండానే మోదీ సర్కారుకు చురకలంటించారు. తాను ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని విమర్శించడం లేదని, మన దేశం ప్రజాస్వామ్యానికే చక్కని ఉదాహరణగా నిలవాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. ప్రపంచానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్న వేళ, అంతే మొత్తంలో అవకాశాలూ అందివస్తున్నాయని, ప్రపంచ స్థాయి నాణ్యతను భారత్ అందిపుచ్చుకోవాలని కోరారు. రాజకీయాల్లోకి మతాలు రావడం దేశ ఆరోగ్యానికి అంత మంచిది కాదని, నెహ్రూ చెప్పినట్టు భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని అన్నారు. ఓ కళాకారుడిగా పరిపాలన సాగిస్తున్న రాజకీయ పార్టీల వ్యవహారాలకు, ప్రజల వాక్ స్వాతంత్య్రానికి సంబంధం లేదని నమ్ముతున్నానని కమల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News