: తెలంగాణకు వస్తాం... సెజ్ ఏర్పాటుకు అనుమతించాలన్న కాగ్నిజంట్!


తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ కేంద్రాన్ని అనుమతి కోరింది. మొత్తం 2.15 ఎకరాల్లో ఐటీ/ఐటీఈఎస్ సెజ్ ను ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతంగా చెబుతూ, కాగ్నిజంట్ 'బోర్డ్ ఆఫ్ అప్రూవల్' (బీఓఏ)కు దరఖాస్తు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి సరిహద్దు ప్రాంతంలో స్థలాన్ని గుర్తించామని పేర్కొంది. కాగా, ఈ నెల 23న వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన జరిగే బీఓఏ సమావేశంలో ఈ సెజ్ కు అనుమతించాలా? వద్దా? అన్న విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమావేశంలో మరో ఎనిమిది సెజ్ ప్రతిపాదనలను కూడా అనుమతుల బోర్డు పరిశీలించనుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తున్న డెవలపర్లకు ఏక గవాక్ష అనుమతి విధానంలో బీఓఏ అనుమతులను ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో మొత్తం రూ. 2.21 లక్షల కోట్ల ఎగుమతులు సెజ్ ల నుంచి జరిగాయి. ఇదే సమయంలో 15 లక్షల మందికి ఉద్యోగాల రూపంలో ఉపాధి లభించడంతో మరిన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News