: ‘ఖేడ్’లో కన్నడ ప్రచారం!... ఓటర్లను ఆకట్టుకున్న పద్మా దేవేందర్ రెడ్డి


మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ టీఆర్ఎస్, ఖేడ్ లోనూ విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. పార్టీకి లెక్కలేనన్ని విజయాలు సాధించిపెట్టిన తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి నిన్న వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లాలో శివారు నియోజకవర్గమైన ఖేడ్ కు సరిహద్దులుగా... అటు కర్ణాటకతో పాటు ఇటు మహారాష్ట్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆ నియోజకవర్గంలో తెలుగుతో పాటు మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడే ఓటర్లు కూడా ఉన్నారు. కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతంలో నిన్న ప్రచారం చేసిన పద్మా దేవేందర్ రెడ్డి తెలుగులో మాట్లాడుతూనే ఉన్నట్టుండి తన ప్రసంగాన్ని కన్నడలోకి మార్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎవరు చేశారని కన్నడలో అడిగిన ఆమె, కేసీఆరే చేశారంటూ అక్కడి ఓటర్ల నుంచి కన్నడలోనే సమాధానం రాబట్టారు. పద్మా దేవేందర్ రెడ్డి ప్రసంగం ఒక్కసారిగా తెలుగు నుంచి కన్నడలోకి, ఆ తర్వాత మళ్లీ తెలుగులోకి మారడంతో టీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యానికి గురయ్యారు.

  • Loading...

More Telugu News