: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం... బిడ్డను మార్చేశారు!


పలు విషయాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో ఘనతికెక్కిన గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్) తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. మగబిడ్డ పుట్టింది అని చెప్పి, ఆడశిశువును చేతిలో పెట్టిన సంఘటన ఈరోజు ఉదయం జరిగింది. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పిడపర్రుకు చెందిన రమ్య పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. కొద్ది నిమిషాలకే ఆమెకు డెలివరీ అయింది. అయితే, రమ్యకు బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ ఆమె కుటుంబీకులెవ్వరినీ ఆమెను చూసేందుకు అనుమతించలేదు. పుట్టింది మగబిడ్డ అని ఆయా వెంకాయమ్మ రమ్య తరపు బంధువులకు చెప్పింది. ఆ తర్వాత కొద్ది సేపటికి, ఆమె బంధువులను లోపలికి అనుమతించారు. 'ఇదిగో మీ బిడ్డ' అంటూ ఆడబిడ్డను వారి చేతిలో పెట్టారు. ముందు మగబిడ్డ అని చెప్పి, తర్వాత ఆడబిడ్డను చేతిలో పెట్టడంపై ఆసుపత్రి సిబ్బందిని రమ్య కుటుంబసభ్యులు ప్రశ్నించారు. వాగ్వాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయాను వారు ప్రశ్నించారు. అబ్బాయి పుట్టాడని తాను చెప్పలేదని.. ఆడపిల్ల పుట్టిందనే చెప్పానని రమ్య డెలివరి సమయంలో అక్కడ ఉన్న ఆయా పేర్కొంది. కాగా, గతంలో ఎలుక కొరికి శిశువు మృతి చెందిన సంఘటన, అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకువచ్చిన 9 నెలల బాలుడి కిడ్నాప్ వంటి సంఘటనలు జీజీహెచ్ లో చోటుచేసుకున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో పూర్తి స్థాయి ప్రక్షాళనకు జీజీహెచ్ శ్రీకారం చుట్టాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News