: ముజ్రా పార్టీలో పాల్గొన్నది జీహెచ్ఎంసీ ఉద్యోగులే... సస్పెండ్ చేసిన గ్రేటర్ కమిషనర్
నిన్న రాత్రి హైదరాబాదులో అశ్లీల నృత్యాలతో కూడిన ముజ్రా పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడిన వ్యక్తుల్లో గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఉద్యోగులున్న మాట వాస్తవమేనట. ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల జాబితాను, వారి ఫొటోలను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సర్కారీ ఉద్యోగులుగా ఉంటూ ముజ్రా పార్టీలో పాల్గొన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెనువెంటనే చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతో, ముజ్రా పార్టీలో పాల్గొని పోలీసులకు చిక్కిన 9 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులను సస్పెండ్ చేేస్తూ కమిషనర్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు సంజీవ్ కుమార్, పద్మభూషణ్ రాజు, రవీంద్రుడు, బిల్ కలెక్టర్లు కృష్ణ, నరహరి, జ్ఞానేశ్వర్, రణ్ వీర్, భూపాల్, బాబూరావులు ఉన్నారు. అంతేకాక ఈ ఘటనపై సమగ్ర విచారణకు జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.