: కేసీఆర్ వారసుడు కేటీఆరే!... ప్రజలే ఆమోదించారంటున్న కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసుడు ఎవరు? ఆది నుంచి ఆయనను వెన్నంటి ఉండటమే కాక, కీలక సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన నేత, మేనల్లుడు తన్నీరు హరీశ్ రావా?... లేక గ్రేటర్ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించడమే కాక రికార్డు విజయాన్ని నమోదు చేసిన మరో నేత, ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావా? ఈ విషయంలో నిన్నటిదాకా స్పష్టత లేదు కానీ... కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత మాత్రం నిన్న దీనిపై ఓ స్పష్టత ఇచ్చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై పలు మీడియా సంస్థలతో వేర్వేరుగా మాట్లాడిన ఆమె.. కేసీఆర్ వారసుడు కేటీఆరేనని తేల్చేశారు. ఈ మేరకు ఆ విషయాన్ని సూటిగా చెప్పని ఆమె, కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ను ప్రజలే ఆమోదించారని చిన్న మెలిక పెట్టారు. తన మేనత్త కొడుకు హరీశ్ రావు ఏమనుకుంటారనుకున్నారో ఏమో తెలియదు కాని... కేసీఆర్ వారసుడి ప్రకటనపై కవిత కాస్తంత జాగ్రత్తగానే మాట్లాడారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నోసార్లు పార్టీకి హరీశ్ రావు చిరస్మరణీయ విజయాలను అందించారని ఆమె పేర్కొన్నారు. 'అయినా... వారసత్వంపై అప్పుడే ఇంత ప్రచారం ఎందుకో!' అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.