: నేను, నా భార్య ఆరోగ్యంగానే ఉన్నాం... జైల్లో పెట్టినా దీక్ష ఆగదు: ముద్రగడ ప్రకటన
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో ముద్రగడ చేపట్టిన దీక్ష నేటితో మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ముద్రగడతో పాటు ఆయన భార్య ఆరోగ్యం కూడా క్షీణించిందన్న వార్తలు కాపులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. తాను, తన భార్య ఆరోగ్యంగానే ఉన్నామని ప్రకటించారు. తన దీక్షను భగ్నం చేసేందుకే ప్రభుత్వం అనారోగ్యం పాట అందుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ వచ్చేదాకా తన దీక్ష ఆగదని ఆయన ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం బలవంతంగా తన దీక్షను విరమింపజేసే యత్నాలు ఫలించవని తెలిపారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా, దీక్ష విరమించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.