: కాంగ్రెస్ సైనికుడినే... ఓటమికి బాధ్యతగా గ్రేటర్ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నా: దానం ప్రకటన


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ గ్రేటర్ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన తన రాజీనామాను పార్టీ అధిష్ఠానానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో తమను అన్ని రకాలుగా అభివృద్ధి బాటన పట్టించే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ కొనసాగిస్తుందని నమ్మిన కారణంగానే ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని తాము భావిస్తున్నామని దానం పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నేతలు మరువకుండా వాటిని నెరవేర్చే దిశగా పనిచేస్తారని తాను విశ్వసిస్తున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడిగా తనకు పూర్తి స్థాయి బాధ్యతలు కట్టబెట్టకున్నా, తాను మాత్రం తన శక్తి మేరకు పనిచేశానన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని కూడా ఆయన పేర్కొన్నారు. ఓటమి పాలైనా ప్రజల పక్షాన పోరు సాగిస్తామన్నారు. ఏది ఏమైనా తాను మాత్రం కాంగ్రస్ పార్టీ సైనికుడినేనని దానం ప్రకటించారు.

  • Loading...

More Telugu News